కలం, మునుగోడు: సమాజంలో అవినీతి పేరుకుపోతోందని, దానిని పూర్తిగా పారద్రోలేంత వరకు పేదలకు నిజమైన న్యాయం జరగదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Raj Gopal Reddy) స్పష్టం చేశారు. నాయకుడనేవాడు నీతిగా ఉంటేనే సమాజానికి నీతివంతమైన పాలన అందించగలరని, ఒకవేళ నాయకులే అవినీతికి పాల్పడితే సమాజంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడులోని (munugode) పీఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించిన పిఆర్టియు టీఎస్ సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ మహోత్సవానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, బిక్షం గౌడ్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా నిబద్ధత, కృషి, పట్టుదలతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు శ్రమించిన బిక్షం గౌడ్ లాంటి వ్యక్తులకు రిటైర్మెంట్ ఉండదని, ఆయన సేవలు సమాజానికి నిరంతరం అవసరమని కొనియాడారు. బిసి బిడ్డ అయిన బిక్షం గౌడ్‌లోని సేవా గుణాన్ని గుర్తించి సమాజానికి సేవ చేసే అవకాశాల కోసం తాను మొదటి నుంచీ మద్దతుగా నిలిచానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇదే వేదికపై నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం శుభపరిణామమేనని, అయితే ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని, ఇక్కడికి నిధులు ఎందుకు రావడం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రికి అదృష్టం కలిసి వచ్చి సీఎంగా అయ్యారు, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ పాలకులు అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూడాలి’ అని విజ్ఞప్తి చేశారు. నిధుల కేటాయింపుపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు పలుమార్లు వెళ్లామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మునుగోడు వంటి వెనుకబడిన నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

