కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా నిద్రపోతోందని హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని స్వయంగా ప్రభుత్వమే చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు నష్టం జరిగిందనే వివరాలు సేకరించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నాయని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే కళ్లు తెరిచి, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి తక్షణ సాయం అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకవైపు పంటలు ఎండిపోయి నష్టపోతుంటే, మరోవైపు పండిన కొద్దిపాటి పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. సన్న వడ్లను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, కానీ దొడ్డు వడ్లు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టాల్లో ఉన్న రైతుల పట్ల కనీస పట్టింపు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అసలు సివిల్ సప్లైస్ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన (Harish Rao) డిమాండ్ చేశారు.

