కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ అసెంబ్లీ (Khairatabad Assembly) స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. 2024 ఏప్రిల్ 23 నుంచి మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని ఇటీవలే హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా గెజిట్ జారీ అయింది. దీంతో, ఇక ఉప ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్లయింది. గెజిట్ ప్రతిని అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించబోతున్నారు. ఖాళీ అయిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. త్వరలోనే ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి, ఎంపీగా పోటీ చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ను కోరగా.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు సూచనలతో స్పీకర్ చివరికి దానం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తీర్పు ఇచ్చారు. దీనిపై హై కోర్ట్ విచారణ జరిపి.. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారంటూ, ఆయనపై అనర్హత వేటు వేస్తూ సెప్టెంబర్ 18న తీర్పు వెల్లడించింది. దీనిపై దానం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ జారీ చేశారు.

