కవితకు బిగ్ షాక్..! ఈసీకి టీఆర్ఎస్ కంప్లైంట్

కలం, తెలంగాణ బ్యూరో : ‘మన పార్టీ టీఆర్ఎస్’ అంటూ కల్వకుంట్ల కవిత (Kavitha) ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును గర్వంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో బాగా పాపులర్ అయిన ఆ మూడు అక్షరాలనే కవిత ఇప్పుడు తన పార్టీకి అబ్రివేషన్‌గా పెట్టుకున్నారు. దీనిపై అటు బీఆర్ఎస్ మానసికంగా రగిలిపోతున్నది. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా ‘ఒరిజినల్ ఒరిజనలే’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఇమేజ్‌లను పెట్టి తనదైన శైలిలో రెస్పాండ్ అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో టీఆర్ఎస్ నేత రియాక్ట్ అయ్యారు. సికింద్రాబాద్ అడ్రస్‌తో 2023లోనే రిజిస్టర్ అయిన తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు తుపాకుల బాలరంగం రాతపూర్వకంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పేరు ఏదైనా అబ్రివేషన్‌గా ఆమె టీఆర్ఎస్ అని ప్రచారం చేస్తే అది తమ పార్టీకి డ్యామేజ్ అవుతుందని, అందువల్ల రిజిస్టర్ చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మూడు రోజుల క్రితం (ఏప్రిల్ 27) లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత సొంత పార్టీని పెట్టుకుంటున్నట్లు ప్రకటించారని ఆ లేఖలో ప్రస్తావించారు.

ఈసీకి రాసిన లేఖలో చేసిన అబ్జెక్షన్ ఏంటి? :

కేంద్ర ఎన్నికల సంఘం 2023 జూలైలోనే తెలంగాణ రాజ్య సమితి పేరుతో తన పార్టీని రిజిస్ట్రేషన్ చేసిందని, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబడ్డారని, గ్యాస్ సిలిండర్ కామన్ సింబల్‌గా వచ్చిందని బాలరంగం ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ అనే పేరు ప్రాచుర్యం పొందిందని, ఇప్పుడు కల్వకుంట్ల కవిత పెట్టే పార్టీకి కూడా టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ ఉండడం తన పార్టీకి ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఆమె పార్టీని రిజిస్టర్ చేయవద్దని ఆ లేఖలో కోరారు. కల్వకుంట్ల కవిత పార్టీ పూర్తి పేరు ఎలా ఉన్నా షార్ట్ కట్‌లో (అబ్రివేషన్)లో మాత్రం టీఆర్ఎస్ అనే ప్రచారం చేసుకుంటారని, ఇది ప్రజల్లో కన్‌ఫ్యూజన్‌కు దారితీస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్య సమితి పేరుతో (టీఆర్ఎస్) పార్టీని దాదాపు నాలుగేండ్లుగా తాను నిర్వహిస్తున్నానని, టీఆర్ఎస్ అనే మూడు అక్షరాల అబ్రివేషన్ (ఆక్రోనిమ్)పై తనకు హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆదిలోనే కవితకు ఊహించని షాక్ :

తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవితకు తెలంగాణ రాజ్య సమితి నుంచి అభ్యంతరం వ్యక్తం కావడం ఊహించని పరిణామం. తెలంగాణ రాష్ట్ర సేన పేరు కింద చిన్న అక్షరాలతో అసోసియేషన్ అని ప్రకటించడంతోనే ఒక వివాదం నెలకొన్నది. కవిత దాఖలు చేసిన అప్లికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా పూర్తిస్థాయిలో స్క్రూటినీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టకముందే అబ్జెక్షన్స్ వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ సైతం కవిత పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నది. పబ్లిక్ రిప్రెజెంటేషన్ యాక్ట్ ప్రకారం, ఎన్నికల సింబల్స్ నిబంధనల ప్రకారం పార్టీ పూర్తి పేరుకు బదులుగా అబ్రివేషన్‌ను లీగల్ పద్ధతిలో ఎలా సవాలు చేయవచ్చనే అంశంపై స్టడీ చేస్తున్నది. ఇదే సమయంలో తెలంగాణ రాజ్య సమితి తరఫున అటు కేంద్ర ఎన్నికల సంఘానికీ, ఇటు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కూ బాలరంగం ఫిర్యాదు చేయడం గమనార్హం. బహుశా కల్వకుంట్ల కవిత ఈ అభ్యంతరాలు వస్తాయని ఊహించారో లేదో అనే చర్చ మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>