కలం, కరీంనగర్ బ్యూరో: గ్రామాల్లో విరివిగా పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) పశు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న జిల్లా ప్రధాన పశువుల ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి ద్వారా పశువులకు అందిస్తున్న సేవలు, వాక్సినేషన్, మందుల వివరాలు తెలుసుకున్నారు. గదులు కలియ తిరుగుతూ ల్యాబరేటరీ, శస్త్ర చికిత్స గదులు, ఎక్స్ రే గది , మందుల గది పరిశీలించారు. సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.
శిథిల భవనం తొలగించండి
ఆస్పత్రి ముందు శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని పరిశీలించి.. తొలగించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పాత భవనం స్థానంలో ఫౌంటెయిన్, పార్కింగ్ ప్లేస్, జంతువుల శవపరీక్ష ఏర్పాటు చేయాలన్నారు. పక్కనున్న మరో భవనాన్ని జంతువుల ఆపరేషన్ కోసం వినియోగించాలని సూచించారు. ఇక్కడున్న అన్ని పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు నరేష్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

