కలం, వెబ్ డెస్క్: దివంగత నేత మారోజు వీరన్న అనుచరుల మద్దతు తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. ఇక మనల్ని ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం దక్కాలన్నదే తన లక్ష్యమన్నారు. శుక్రవారం కవితకు మారోజు వీరన్న అనుచరులు మద్దతు తెలిపారు. సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ తదితరులు జాగృతి కార్యాలయానికి చేరుకొని కవితకు మద్దతు ప్రకటించారు. ఈ నెల 25న కవిత కొత్త రాజకీయపార్టీని స్థాపించబోతున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రజా సంఘాల నుంచి మద్దతు దక్కుతోంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తాను బహుజనుల కోసమే కొట్టాడుతున్నానని పేర్కొన్నారు. తాను ఈ విషయం మాట్లాడటం మొదలుపెట్టాకే కష్టాలు మొదలయ్యాయన్నారు. ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానన్నారు.
మహిళల భాగస్వామ్యం పెరగాలి
‘మారోజు వీరన్న అభిమానుల మీటింగ్‌లో ఎక్కువ మంది మహిళలు కనిపిస్తున్నారు. ఇదే విధంగా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. మూడు, నాలుగేండ్ల క్రితం మనం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి మహిళాబిల్లు వచ్చేలా చేశాం. గతంలోనే ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ మళ్లీ అదే బిల్లును తీసుకొచ్చి మోసం చేస్తున్నారు. ఏ వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలను ఆ వర్గాలకు అందించకుండా ప్రతి దాంట్లో రాజకీయ ప్రయోజనం చూసుకుంటున్న పరిస్థితి ఉంది.’ అంటూ కవిత పేర్కొన్నారు.
జయశంకర్ సార్ మనకు ఆదర్శం
బహుజన తెలంగాణ ప్రతిపాదనను చాలా మంది జయశంకర్ వద్ద గుర్తు చేశారని పేర్కొన్నారు. జాగృతి సంస్థ ఏర్పాటుకు జయశంకర్ సార్ మార్గదర్శకులని.. తాను ఆయనకు వీరాభిమానినని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ అనే ప్రతిపాదనను తాను ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ ముందు ప్రస్తావించానని కవిత అన్నారు. అయితే ముందు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకోవాలని.. ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని జయశంకర్ చెప్పినట్టు గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్యం అనంతరం అంబేద్కర్ కూడా ఇటువంటి ప్రతిపాదన చేశారని కవిత గుర్తు చేశారు. భారత కులవ్యవస్థలో నిరంతరం బహుజనులకు రాజ్యాధికారం అంశం చర్చకు వస్తూనే ఉంటుందన్నారు.
తెలంగాణ వచ్చి 12 ఏండ్లయినా సామాజిక న్యాయమేది?
తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా సామాజిక న్యాయం జరగలేదని రాహుల్ పేర్కొన్నారు. ఏ వర్గానికి సంపూర్ణంగా న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికీ చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పుల తడకగా చేసిన సర్వేలో కూడా చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. గ్రామాల్లో వార్డు మెంబర్, సర్పంచ్ పదవులు కూడా దక్కించుకోని కులాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కులాలు బలంగా మారినప్పుడు మాత్రమే వారికి న్యాయం జరగుతుందని మారోజు వీరన్న నమ్మేవారని గుర్తు చేశారు. అందుకే ఆయన కులాల అస్తిత్వ పోరాటాలకు విప్లవ పోరాటాలను జత చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుల సంఘాల ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ మారోజు వీరన్నేనని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం జరగాలంటే కుల సంఘాలు బలపడాలంటూ సూచించారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 25న నూతన రాజకీయ శక్తిగా ఎదగబోతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని, సామాజిక కోణాన్ని కలిపే ప్రయత్నం చేద్దామని పేర్కొన్నారు.
Read Also: 8 మంది అటవీశాఖ అధికారులకు ఐఎఫ్ఎస్ హోదా
Follow Us On: X(Twitter)

