కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ తదితర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పారిశుధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డితో కలిసి బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్లను నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.

