కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో (El Nino) కారణంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో త్వరలో వరుణ యాగం నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి పంటలు పండి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ యాగాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ దేవాదాయ శాఖలో ఇటీవల పలు ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందజేశారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, వాహన పూజ పురోహితులు, అసిస్టెంట్ కుక్‌లు, డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాల్లో మొత్తం 191 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, ఇటు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ దేవాదాయ శాఖలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పనితీరుకు ఈ నియామకాలే నిదర్శనమన్నారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.

