కేటీఆర్, కవిత క్రెడిట్ వార్ !

కలం, ఖమ్మం బ్యూరో: కేటీఆర్, కవిత మధ్య క్రెడిట్ వార్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల (Velugumatla) బాధితులను పరామర్శించేందుకు వారి తరఫున పోరాడేందుకు అన్నాచెల్లెల్లు ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా ఓ చిన్న అంశం దొరికినా అందిపుచ్చుకొనేందుకు కవిత సిద్ధమవుతోంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తరహా ప్రయత్నం చేస్తున్నది. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా కవిత(Kavitha), కేటీఆర్(KTR) ఇద్దరు నేతలకు వెలుగుమట్ల అంశం కలిసొచ్చింది. అక్కడ రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు బాధితుల తరఫున భరోసా కల్పించేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఫిబ్రవరి 26న కేటీఆర్ వెలుగుమట్ల బాధితులను పరామర్శించి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు‌లో కేసు ఫైల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్‌‌భవన్‌లో తల దాచుకుంటున్న నిర్వాసితులకు భోజనం, వైద్య సదుపాయాలు కూడా పార్టీ తరపున కల్పిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు కోసం న్యాయవాదిని పెట్టి బాధితుల పక్షాన కొట్లాడుతామని దీనికి కావలసిన నిధులను పార్టీ ఫండ్ నుంచే ఖర్చు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

కవిత నిరసన

కవిత వెలుగుమట్ల (Velugumatla) బాధితులను పరామర్శించడం కోసమే ఖమ్మం వచ్చినప్పటికీ ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయారు. కలెక్టర్ అంబేద్కర్‌భవన్‌కు వచ్చి బాధితుల దుస్థితి పరిశీలించి వారికి కనీస వసతులు వెంటనే కల్పించాలనే డిమాండ్‌తో ధర్నా, ర్యాలీ, రోడ్డుపై బైఠాయించడం వంటి నిరసనలు తెలిపారు. వెంటనే స్థానిక ఆర్డీవో ఖమ్మం జెడ్పీ సెంటర్లో కవితతో మాట్లాడినప్పటికీ, కలెక్టర్ రావలసిందేనని పట్టు బట్టారు. అప్పటికే మూడుగంటలకు‌పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో కవితను అరెస్ట్ చేశారు. కానీ నిబంధనలు పాటించకుండా, మహిళా కానిస్టేబుళ్లు లేకుండా అరెస్ట్ చేయడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. జాగృతి నాయకులు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడేండ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాలకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. దీంతో పోలీసులు కవితకు నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. విడుదలైన వెంటనే కవిత నేరుగా అంబేద్కర్ భవన్‌కు వెళ్లి నిరవధిక నిరహారదీక్షలో కూర్చున్నారు. అనంతరం మంగళవారం ఉదయం 6 గంటలకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు దీక్షను భగ్నం చేసి, ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ చేరుకున్న జాగృతి అధ్యక్షురాలు వెలుగుమట్ల బాధితులకు కూల్చిన చోటనే స్థలంతోపాటు ఇళ్లు నిర్మిస్తామని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగుతోందని ప్రతినబూనారు. బంజారాహిల్స్ రాష్ట్ర జాగృతి కార్యాలయంలో కవిత దీక్షను కొనసాగిస్తున్నారు.

దిగివచ్చిన ప్రభుత్వం

24 గంటల వ్యవధిలో కవిత వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ఆమె రెండు సార్లు అరెస్ట్ అవ్వడం, అవమానాలు ఎదుర్కోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు వెంటనే భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్మస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ నాయకులు ఆమెకు  మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళన మీడియాలో బాగా ఫోకస్ అయ్యింది.  ఓ వైపు కేటీఆర్, మరో వైపు కవిత పోటీ పడి బాధితులకు అండగా నిలవడంతో ప్రభుత్వం కూడా కదిలింది. యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సర్వే చేయించి నిజమైన బాధితులు 410 మంది ఉన్నట్లుగా గుర్తించింది. వీరికి 15 రోజుల్లో ముగ్గు పోస్తానని ఇప్పటికే మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. మరో మంత్రి తుమ్మల కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం వేగంగా అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారులు బాధితులను కలెక్టర్ ఆఫీస్‌కు పిలిచి వారికి టోకెన్లు అందిస్తున్నారు. టోకెన్లు అందుకున్నవారికి ఇళ్లస్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా కూల్చిన చోటనే నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వెలుగుమట్ల బాధితుల అంశం కవితకు, కేటీఆర్‌కు కలిసొచ్చింది. ఈ పోరాటంలో కేటీఆర్ కంటే కవితకు కాస్త ఎక్కువగా క్రెడిట్ దక్కినట్టు కనిపిస్తోంది.

Read Also: రైతులకు మోడీ గుడ్‌ న్యూస్.. త్వరలో పీఎం కిసాన్ నిధులు రిలీజ్

Follow Us On: Pinterest

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>