కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని సింగరేణి కార్మికులకు నెల రోజుల్లోనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని.. లేదంటే నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు. జెండా పండుగలో భాగంగా భూపాలపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.గత ఐదురోజులుగా కార్మికులతో మాట్లాడుతున్నానని.. వాళ్లకు కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ లోగా ఉద్యోగాలు ఇవ్వపోతే ఇక్కడే తాను వచ్చి నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. సింగరేణి బాయిబాటలో భాగంగా భూపాలపల్లి కాకతీయ ఖని- 5 గని వద్ద కార్మికులతో కవిత మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
కళ్లలో నీళ్లు వచ్చాయి..
డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఓ పెద్ద మనిషి కలిసి తన గోస చెప్పుకుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఇబ్బంది పెడితే వారి గోసం ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. బొగ్గుబాయిల దగ్గర ఉండే ప్రజలు కనీసం కార్మికుడిగానైనా సింగరేణిలో జాబ్ వస్తుందని భావిస్తారని.. రిటైర్ మెంట్ అవుతున్న వాళ్లు తమ పిల్లలకో, బంధువులకో డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించుకోవాలని భావిస్తారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మెడికల్ బోర్డు పెట్టకుండా రిటైర్ మెంట్ కు దగ్గర్లో ఉన్న వాళ్లను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. భూపాలపల్లిలో నేడు మొదటి జెండా ఎగురవేశామని.. రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వారికీ ఫ్రీ బస్సు పెట్టాలి..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పి ఫ్రీ బస్ తప్ప ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని కవిత ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్ కారణంగా కూడా మహిళలు గొడవ పడుతున్నారని.. పురుషులకు సీట్లు లేని పరిస్థితి వచ్చిందన్నారు. బస్సుల్లో వికలాంగులకు, 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్ కు కూడా ఉచిత ప్రయాణం అందుబాటులోకి తేవాలని సూచించారు. ఇక షాదీ ముబారక్, తులం బంగారం, కేసీఆర్ కిట్ ఇలా ఏవీ ఇవ్వటం లేదన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి చెబితే నమ్మరని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించారని.. ఓట్లు వేసుకున్నాక వాళ్లు పత్తా లేకుండా పోయారని చురకలు అంటించారు.
కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే బీఆర్ఎస్..
కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే బీఆర్ఎస్ కూడా మారిపోయిందని కవిత విమర్శించారు. ఇప్పుడు సింగరేణి ప్రాంతం గురించి మాట్లాడే వాళ్లు లేకపోవటంతోనే భయం లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా నిజమైన పేదలకు ఇళ్లు ఇవ్వలేదని.. నిజమైన పేద మహిళలకు ఇళ్లు వచ్చేలా తాము కృషి చేస్తామన్నారు. ఆడబిడ్డలను నమ్ముకొని పార్టీ పెట్టానని.. తనకూ ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు.
సత్తెన్న సత్య నాశనం చేస్తున్నాడు..
భూపాలపల్లిలో గతంలో ఉన్న ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారని.. చెరువులను కూడా వదలలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బాయిలు ఉండే ఈ ప్రాంతంలో అసలే పర్యావరణం బాగుండదని.. అలాంటి చెరువులను కూడా కబ్జా పెట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అవే పనులు చేస్తున్నాడని ఆరోపించారు. తమ సత్తెన్న మూడుసార్లు ఓడిపోయిండని ప్రజలు గెలిపిస్తే సత్తె నాశనం చేస్తున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ కోసం 140 ఎకరాల భూములు ఇచ్చిన వారికి కచ్చితంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

