కలం, స్పోర్ట్స్: శ్రీలంకతో సోమవారం నుంచి రావల్పిండి వేదికగా ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టులో పీసీబీ శనివారం కీలక మార్పులు చేసింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌తో పాటు మరో ముగ్గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు 16 మంది సభ్యుల జట్టులో చోటు కల్పించింది.బ్యాటర్ మహమ్మద్ తయ్యాబ్ ఆరిఫ్, టీనేజ్ ఫాస్ట్ బౌలర్ అలీ షబ్బీర్, పేసర్ సాకిబ్ ఖాన్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నలుగురికి చోటు కల్పించేందుకు జట్టు నుంచి అలీ ఉస్మాన్, అబ్దుల్లా ఫజల్‌లను పీసీబీ విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లోని వార్మప్ మ్యాచ్‌లో ఉస్మాన్ కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన నేపథ్యంలో వారిపై వేటు వేయడం గమనార్హం.
ఇటీవలి దేశవాళీ టోర్నీల్లో అమీర్ జమాల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తయ్యాబ్ ఆరిఫ్ 727 పరుగులు చేసి నిలకడ చూపగా, 19 ఏళ్ల అలీ షబ్బీర్, వికెట్ల వేటలో మెరిసిన సాకిబ్ ఖాన్లు దేశవాళీతో పాటు వార్మప్ మ్యాచ్‌లో మెరిసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్థాన్ శ్రీలంకతో తొలి టెస్టు ఆడనుంది. మొదటి టెస్టు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, నవంబర్ 17 నుంచి రెండో టెస్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.

