కలం, వెబ్ డెస్క్: తమ నియోజకవర్గం హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ రద్దు చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే చెత్త మొత్తం తమ హుజురాబాద్ కు తీసుకురావడం ఎందుకు? మా ప్రజలు ఏం తప్పు చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాను హుజురాబాద్ బంద్‌కు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అద్భుతంగా విజయవంతం చేశారని అన్నారు. ఒక్క దుకాణం కూడా తెరవకుండా ప్రజలు ఐక్యంగా నిలబడి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారని చెప్పారు. ఇది హుజురాబాద్ ప్రజల ఆవేదనకు నిదర్శనమని పేర్కొన్నారు.
‘ప్రభుత్వానికి నా మీద కోపం ఉంటే చర్యలు తీసుకోండి. కానీ హుజురాబాద్ ప్రజలను శిక్షించకండి. ఇతర ప్రాంతాల చెత్తను మా హుజురాబాద్ పై మోపాలని ప్రయత్నించడం అన్యాయం. నిన్నటి బంద్‌తో ప్రభుత్వం మేల్కొని వెంటనే డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలి. లేదంటే ఏప్రిల్ 7 ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతాం. ప్రజల కోసం పోరాటం ఆగదు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

