epaper
Monday, January 19, 2026
spot_img
epaper

ఈవీఎంలు కాదు.. ఈసారి అక్కడ బ్యాలెట్​ పేపర్లతోనే ఎన్నికలు

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషిన్స్​(ఈవీఎం)ల మీద అనుమానాలు, వివాదాలు, చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి గ్రేటర్​ బెంగళూరు అథారిటీ(జీబీఏ) ఎన్నికలను ఈవీఎంలకు బదులు బ్యాలెట్​ పేపర్ల (Ballot Papers) తో నిర్వహించనుంది. ఈ మేరకు కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధానాధికారి జి.ఎస్.సంగ్రేషి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలు మాత్రం కచ్చితంగా ఈవీఎంలతోనే జరపాలి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్​ పేపర్లతో జరపవద్దని ఎలాంటి నిబంధన లేదు. ఏ కోర్టూ చెప్పలేదు. అందుకే మేము బ్యాలెట్​ పద్ధతి ఎంచుకున్నాం. వేరే ఏ కారణం లేదు. దీనిపై అన్ని రాజకీయ పక్షాలతోనూ సంప్రదింపులు జరిపాం’ అని సంగ్రేషి అన్నారు.

కర్ణాటకలో స్థానిక ఎన్నికలన్నీ బ్యాలెట్​ పేపర్ల (Karnataka Ballot Papers) తోనే నిర్వహించాలని సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి చేసిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. దీనిపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్​ సంతోషం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ప్రజల నమ్మకం, క్రెడిబిలిటీ కోల్పోయినందువల్లే బ్యాలెట్​ పద్ధతికి ఈసీ మళ్లినట్లు చెప్పారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తోంది. బ్యాలెట్​ విధానంలో అక్రమాలు, హింస జరుగుతాయని వాదిస్తోంది.

కాగా, 2015లో బృహత్​ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) గా ఉన్న ప్రస్తుత జీబీఏ ఎన్నికలు ఈవీఎంలతోనే జరగడం గమనార్హం. ప్రస్తుతం స్టేట్​ ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జీబీఏలో 88,91,411 ఓట్లు ఉన్నాయి. తుది ఓటర్ల జాబితా మార్చి 16న వెల్లడించనున్నారు. ఎన్నికలు ఈ ఏడాది మే 25, జూన్​ 30 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మరికొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>