కలం, నిజామాబాద్ బ్యూరో : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ అదే ఇంట్లో నిద్రపోయి దొరికిపోయాడు. కామారెడ్డి(Kamareddy) జిల్లా బీర్కూర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. బీర్కూర్ (Birkur) లో మాలి పటేల్‌కు రెండు ఇళ్లు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం పాత ఇంటికి దగ్గరే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పాత ఇంటికి తాళం వేసి కొత్త ఇంట్లో ఉంటున్నారు.
ఓ దొంగ పాత ఇంటి వెనుక గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న వస్తువులను మూట గట్టాడు. మద్యం సేవించి ఉండడంతో నిద్ర వచ్చి.. దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే నిద్రపోయాడు. ఇంటి యజమానురాలు పాత ఇంట్లోకి వచ్చారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే ఒక వ్యక్తి పడుకుని ఉండటం గమనించింది. వెంటనే కేకలు వేస్తూ బయటకు రాగా చుట్టుపక్కల వారు అందరూ వచ్చి దొంగను పట్టుకున్నారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు.


