కలం, కరీంనగర్ బ్యూరో: త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే ముస్లింల పవిత్ర పండుగ ‘బక్రీద్’ (ఈద్-ఉల్-అజ్హా) వేడుకలు కరీంనగర్ (Karimnagar) నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక రేకుర్తిలోని ప్రధాన ఈద్గా (Rekurthi Eidgah) వద్ద గురువారం ఉదయం జరిగిన పవిత్ర ప్రత్యేక ప్రార్థనల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) పాల్గొన్నారు. ఈద్గాకు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం సీపీ గౌష్ ఆలం ముస్లిం సోదరులందరికీ ఆలింగనం చేసుకుని, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సమాజంలో శాంతి, సోదరభావం, కరుణను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అధికారులు, సిబ్బందికి సీపీ శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంకి.. ఈద్గా వద్ద విధుల్లో ఉన్న ట్రైనీ ఐపిఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీపీ కూడా విధుల్లో ఉన్న సిబ్బందిని అభినందిస్తూ, వారికి పండుగ శుభాకాంక్షలు అందజేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు పకడ్బందీగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు.

