కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి మార్పు అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తినకు వెళ్లడంతో సీఎం మార్పుపై ఊహాగానాలకు బలం చేకూరింది. ఎన్నికల సమయంలో మాటిచ్చిన ప్రకారం తనకు సీఎం సీటు ఇవ్వాలని డీకే.. మరోవైపు ఐదేళ్లపాటు తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఇద్దరు నేతలు విడివిడిగా సమావేశం అయినట్లు సమాచారం.
భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు జరిగిన చర్చలో కేవలం రాబోయే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక పరిషత్ ఎన్నికలపైనే మాట్లాడినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కూలంకషంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. కర్ణాటక సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాలు కేవలం ఊహాగానాలేనని ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులను ప్రకటించినట్లే, కర్ణాటక రాజ్యసభ, పరిషత్ స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

