Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా మార్ట్.. ప్రగతి స్మార్ట్, ఏడాదిలోనే కోటిన్నర టర్నోవర్!

కలం, ఖమ్మం బ్యూరో:  గతంలో ఖమ్మం జిల్లాలో వందలాది మహిళా సంఘాలు ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసినప్పటికీ సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇళ్లకే పరిమితమయ్యేవారు. దళారీల చేతుల్లో మోసపోతూ, బ్రాండింగ్ లేక వ్యాపారాన్ని వృద్ధి చేసుకోలేకపోయేవారు. కానీ, అప్పటి జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ఆలోచనల నుంచి పుట్టిన ‘మహిళా మార్ట్’ ఆ మహిళల రాతను మార్చేసింది. 2025 మే 28న వైరా రోడ్డులోని ప్రభుత్వ భవనంలో ప్రారంభమైన ఈ మార్ట్, ఏడాది కాలంలోనే (మూడు రోజులు తక్కువ) రూ. 1.10 కోట్ల టర్నోవర్ సాధించి ఒక సరికొత్త రికార్డు సృష్టించింది.

133 డ్వాక్రా గ్రూపుల భాగస్వామ్యం

ఈ మార్ట్ కేవలం ఒక దుకాణం కాదు, ఒక బలమైన నెట్‌వర్క్. గౌతమి జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో, 21 మండల సమాఖ్యల సహకారంతో 133 డ్వాక్రా గ్రూపులు ఇక్కడ భాగస్వాములుగా ఉన్నారు. ఎవరికి వారుగా విడివిడిగా వ్యాపారం చేయడం కంటే, అందరూ కలిసి ఒకే గొడుగు కిందికి రావడం వల్ల ఉత్పత్తులకు ఒక రకమైన గుర్తింపు నమ్మకం ఏర్పడ్డాయి. వినియోగదారులకు పూర్తిగా నాణ్యమైన, నాచురల్, హెర్బల్, ఆర్గానిక్ ఉత్పత్తులను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈ మార్ట్‌లో ప్రస్తుతం సుమారు 120 రకాల ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ ప్రతి వస్తువును బార్ కోడ్ ద్వారా స్కాన్ చేసి విక్రయించడం విశేషం. దీనికి తోడు మార్ట్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ కూడా కలుపుకుని నెలకు సుమారు రూ. 8 నుండి 8.5 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా సుమారు 10 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కూడా లభిస్తోంది.

ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మహిళలు

​మహిళా మార్ట్ సాధించిన ఈ విజయంతో దీనికి సరుకులు పంపిణీ చేసే మండల సమాఖ్యల మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే పలువురు మహిళలు లక్షలాది రూపాయలు సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన మృణాళిని అనే మహిళ అత్యధికంగా రూ. 7,30,073 సంపాదించగా, ముదిగొండ మండలానికి చెందిన లావణ్య రూ. 5,35,000 ఆర్జించారు. అలాగే రఘునాథపాలెం మండలానికి చెందిన ఎమ్. రమాదేవి రూ. 4,97,328, చింతకాని మండలానికి చెందిన సీహెచ్ సునీత రూ. 2,52,091 లబ్ధి పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సగటున ప్రతి మండల సమాఖ్య ఏడాదికి రూ. 2 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు ఆదాయాన్ని గడించడం గమనార్హం.

12 శాతం మాత్రమే మార్జిన్

రైతుల దగ్గర నుంచి నేరుగా నాణ్యమైన సరుకులను సేకరించి, డ్వాక్రా సంఘాల సభ్యులతో స్వయంగా ప్రాసెస్ చేయిస్తున్నారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా, కొన్న ధర కంటే కేవలం 12 శాతం మాత్రమే అదనపు మార్జిన్‌ వసూలు చేస్తూ సరసమైన ధరలకే నాణ్యమైన వస్తువులను అందిస్తున్నారు. ప్రభుత్వ సహాయం, పక్కా ప్రణాళిక, మహిళల శ్రమ తోడైతే కుటీర పరిశ్రమలు కూడా కార్పొరేట్ స్థాయి బిజినెస్ మోడల్స్‌గా ఎదగగలవని ఖమ్మం మహిళా మార్ట్ నిరూపించింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

ఖమ్మం మహిళా మార్ట్ కేవలం ఒక వ్యాపార కేంద్రం కాదు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక విజయవంతమైన మోడల్. సరైన వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు తోడైతే డ్వాక్రా మహిళలు కార్పొరేట్ సంస్థలకు సైతం పోటీ ఇవ్వగలరని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి ‘మహిళా మార్ట్’లను ఏర్పాటు చేస్తే, గ్రామీణ మహిళల జీవితాల్లో మరింత వెలుగులు నింపవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం గమనార్హం.

తక్కువ ధరకే వస్తువులు

మిల్లెట్ తో తయారు చేసిన బిస్కట్లు, రాగి పిండి, బ్రౌన్ రైస్ వంటివి తీసుకెళ్తాను. బయట షాపులకంటే తక్కువ రేటుకు ఇస్తున్నారు. అందుకనే రెగ్యులర్ గా వస్తున్నాను.
– విన్నీ,ప్రైవేట్ ఉద్యోగి, ఖమ్మం

ఇక్కడి ప్రొడక్ట్స్ నచ్చాయి

పాపడ్, హెయిర్ ఆయిల్, షాంపూ వంటివి ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ షాంపూ చాలా ఫేమస్, నాకు చాలా నచ్చింది. నేచురల్ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కాస్త దూరమైన ప్రతి సారి ఇక్కడే కొంటాను.
– యశస్విని, కాలేజీ స్టూడెంట్, ఖమ్మం

నాకు ఉపాధి దొరికింది

ఏడాదిగా ఇక్కడే బిల్లింగ్ సెక్షన్ లో పని చేస్తున్నాను. రూ.16000 సాలరీ ఇస్తున్నారు. నేను కూడా డ్వాక్రా మహిళనే( స్నేహంజలి గ్రూప్). నాతో పాటు మరో ఏడు మంది పని చేస్తున్నారు. మహిళా మార్ట్ ద్వారా మాకు ఉపాధి లభించడం చాలా సంతోషంగా ఉంది.

– భవాని, మహిళా మార్ట్ ఉద్యోగి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>