కలం, వెబ్ డెస్క్: భారత మాజీ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ (Karn Sharma) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రెండు దశాబ్దాలకు పైగా సాగిన అతని క్రికెట్ కెరీర్ ముగిసింది. కర్ణ్ శర్మ భారత్ తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20 ఆడాడు. 2014 నవంబర్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. 2014లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక ఆటగాళ్లుగా మారడంతో కర్ణ్‌కు జాతీయ జట్టులో తిరిగి అవకాశం దక్కడం కష్టమైంది.
అయినా దేశవాళీ, ఐపీఎల్‌లో కర్ణ్ తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 270 వికెట్లు తీశాడు. ఉత్తరప్రదేశ్, రైల్వేస్, విదర్భ, ఆంధ్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనూ కర్ణ్‌కు మంచి కెరీర్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. 90కి పైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి నాలుగు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు.
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలన్నది తన చిన్ననాటి కల అని కర్ణ్ తెలిపాడు. ఆ కలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేశానని చెప్పాడు. తన కెరీర్‌లో కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, ట్రైనర్లు, రంజీ, ఐపీఎల్ జట్లు, ఫిజియోలు, గ్రౌండ్స్‌మెన్ అందరి సహకారం ఉందని గుర్తు చేసుకున్నాడు. తన టెస్టు క్యాప్ నంబర్ 283 అందుకున్న రోజు కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని కర్ణ్ పేర్కొన్నాడు.
భారత్ తరఫున ఆడటం, అక్కడ నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత వెంటనే ఏం చేయాలనే దానిపై కర్ణ్‌కు స్పష్టత లేదు. అయితే క్రికెట్‌తో మాత్రం అనుబంధం కొనసాగించాలని భావిస్తున్నాడు. అవసరమైన వారికి తన సహాయం అందిస్తూ ఆటకు తిరిగి సేవ చేయాలనుకుంటున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రయాణానికి ముగింపు పలికిన కర్ణ్ శర్మ.. ఇక తన జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

