కేంద్రం రద్దు చేసిన చట్టాలు పునరుద్ధరించాలి: సత్యనారాయణ రెడ్డి

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేందుకు, కార్పొరేట్ దిగ్గజాలకు చట్టబద్ధ శ్రమ దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తూ మోదీ సర్కార్ రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ రెడ్డి (Satyanarayana Reddy) డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ ప్రచార సామాగ్రిని ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం వెంకటరామారెడ్డి భవన్‌లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ సవరణల పేరుతో వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చారన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల నేతృత్వంలో ఇప్పటికే 28 పర్యాయాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగాయన్నారు. నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గ సంక్షేమానికి మరణ శాసనాలుగా మారాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కనీస వేతనం రూ.26,000 పెంచుతూ అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కార్మిక హక్కుల సాధనకై సెప్టెంబర్ 6 ,7 ,8 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నామని 6న‌ భారీ ర్యాలీ, గొప్ప కార్మిక బహిరంగ సభ జరగనుందని కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను పాలకులు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భాగీ కృష్ణ యాదవ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సురేష్, ఏఐటీయూసీ జిల్లానాయకులు యాదయ్య, రాములు, నరేష్, భాస్కర్ రెడ్డి, రంగన్న, శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>