కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని.. పీసీసీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో SIR ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ సవరణ ప్రక్రియలో ప్రతి ఓటర్‌కు అవగాహన కల్పించి, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమీక్షలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో SIR పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. జూలై 31 నాటికి నియోజకవర్గంలో 90 శాతం ప్రక్రియ పూర్తి చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆగస్టు 3 లోపు SIR ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఫోటో తీసుకునే అవకాశం కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు (BLO)లతో సమన్వయం చేసుకుని ప్రతి ఓటర్‌కు SIRపై అవగాహన కల్పించాలని సూచించారు. BLA-2లు ప్రతి ఇంటిని సందర్శించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.బూత్ స్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరించాలని కోరారు. కార్యకర్తల సందేహాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.ఈ సమావేశంలో SIR రిటర్నింగ్ ఆఫీసర్ మడుపు మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, SIR సూపర్వైజర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

