కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మానకొండూరు మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాపూర్, తెనుగుపల్లి గ్రామ పరిధులలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 భారీ ఇసుక డంపులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి, సీజ్ చేశారు.
సీజ్ చేసిన ఈ డంపులలో మొత్తం 115 ట్రిప్పుల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీపీ గౌష్ అలం హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

