కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ (Ameenpur) పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగూడెం చౌరస్తాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి , ఐలాపూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. చిన్నారి భయంతో పెద్దగా కేకలు వేస్తూ ఏడవడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని పాపను సురక్షితంగా రక్షించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రఘునాథ్ (48)గా గుర్తించారు. ఇతడు స్థానిక సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

