కలం, మెదక్ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad) మహా నగర ప్రజలకు పచ్చని అటవీ అందాల మధ్య నూతనంగా రెండు ఎకో ఫారెస్ట్ పార్కులు (Eco Forest Parks) అందుబాటులోకి వచ్చాయి. ప్రఖ్యాత నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని వన సంపదను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా అమృత వనం (Amrutha Vanam), హరిత ద్వారం (Haritha Dwaram) పేరుతో రెండు ఫారెస్ట్ పార్కులు సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యాయి.
ఆహ్లాదం కోసం అమృత వనం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి అటవి ప్రాంతంలో అమృత వనం ఎకో ఫారెస్ట్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నర్సాపూర్ రిజర్వుడ్ ఫారెస్ట్ ప్రాంతంలో 4343 ఎకరాల పచ్చని రిజర్వ్ అటవీ ప్రాంతంలో 781 ఎకరాల్లో ఎకో పార్కును అటవీ శాఖ అభివృద్ది చేసింది. ఇందులో భాగంగా రెండు కిలోమిటర్ల వాకింగ్ ట్రాక్ , రెండు కిలోమిటర్ల సైక్లింగ్ ట్రాక్, ఆరు కిలోమీటర్ల నేచర్ ట్రయల్స్ ను తయారు చేశారు. అంతే కాకుండా పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్క్, మానసిక ప్రశాంతత కోసం వచ్చే వారి కోసం ప్రకృతి ఒడిలో యోగా, మెడిటేషన్ చేసుకునే విధంగా మెడిటేషన్ సెంటర్, అటవీ ప్రాంత అందాలను వీక్షించేందుకు వాచ్ టవర్, వచ్చే పర్యాటకుల కోసం రీక్రియేషన్ సదుపాయలు కల్పించారు. పచ్చ వనంలో భాగంగా తంగేడు వనం, జమ్మి వనం, బటర్ ఫ్లై వనం, బాంబో వనం, రాశి వనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సందర్శకులు సేద తీరడానికి రచ్చబండలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పార్కుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సదుపాయం, కూర్చోడానికి బెంచ్‌లు , టాయిలెట్స్ మౌలిక సదుపాయలు కల్పించారు.
పార్కులో లోపల అంతర్గత రోడ్లను సైతం ఫారెస్ట్ థీమ్‌కు తగిన విధంగా వేశారు. సందర్శకులకు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఆహ్లాదంగా ఉండే విధంగా, సహజ సిద్ధంగా, జీవ వైవిధ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమృత వనం ఎకో ఫారెస్ట్‌ను తీర్చిదిద్దారు.
ప్రకృతికి నిలయం హరిత ద్వారం
అమృత వనం ఎకో ఫారెస్ట్ పార్కుకు దగ్గరగా మంబాపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం హరిత ద్వారం పేరుతో మరో పార్కును అభివృద్ధి చేసింది. దుండిగల్ ఓఆర్ఆర్ నుండి కేవలం 15 కిలో మీటర్ల దూరంలో 2545 ఎకరాల పచ్చని రిజర్వ్ అటవీ ప్రాంతంలో 1777 ఎకరాల్లో ఐదు కోట్ల రూపాయలతో హరిత ద్వారం పార్కును అటవీ శాఖ అభివృద్ది చేసింది. ఇందులో భాగంగా రెండు కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్, రెండు కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలో మీటార్ల నేచర్ ట్రయిల్స్ ను తయారు చేశారు. అటవీ ప్రాంతంలో నేచర్ ట్రయిల్స్ లో భాగంగా జీప్ లో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. పార్కుకు సంబంధించి ఎంట్రన్స్ ఆర్చ్ , టికెట్ కౌంటర్, అంతర్గత రోడ్లు, పార్కింగ్ సదుపాయం కల్పించారు. దుండిగల్ ఓఆర్ఆర్ నుండి కేవలం 12 కిలో మీటార్ల దూరంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పచ్చన అడవి అందాల మధ్య అభివృద్ధి చేసిన బొంతపల్లి అమృత వనం, మంబాపూర్ హరిత ద్వారం పార్కులను అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేడు ప్రారంభించారు. ఈ పార్కులకు ఓఆర్ఆర్ నుండి కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు. కేవలం సిటీ నుంచి గంట ప్రయాణంలో సహజ సిద్ధ అందాలతో జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్న ఈ రెండు పార్కులను సందర్శించవచ్చు.

