కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో పట్టపగలే కాల్పుల కలకలం రేగింది. స్థానిక పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు సిబ్బంది గాయపడగా, ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. మేనేజర్ ముస్తాక్, మధుకర్, కమలాకర్, సెక్యూరిటీ గార్డ్ రాకేశ్ గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని పోలీసులు ధృవీకరించారు. కరీంనగర్‌లోని ప్రముఖ జ్యువెలరీ షో రూమ్‌లోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ క్రమంలో మేనేజర్ ముస్తాక్ తలపై నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈయన ప్రస్తుతం వెంకటాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధుకర్ పొట్ట భాగంలో బుల్లెట్ గాయమైంది. ఆయన కూడా వెంకటాద్రి ఆసుపత్రిలోనే ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ రాకేశ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ దోపిడీ ప్రయత్నమా లేక పాత కక్షల వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!
Follow Us On : WhatsApp

