కలం, వెబ్ డెస్క్: ఇండోనేషియా (Indonesia)లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సురబయ నుంచి మకస్సర్ ప్రాంతానికి 271 మంది ప్రయాణికులతో వెళ్తున్న కేఎంపీ ముతియారా సెంతోసా అనే పడవ మార్గమధ్యలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అయిదుగురు మరణించగా, 41 మంది గల్లంతయ్యారు. మిగతావారిని నేవీ సిబ్బంది ప్రాణాలతో రక్షించగలిగారు. మదుర ద్వీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు న్యూస్ ఏజెన్సీ జకార్తా గ్లోబ్ వెల్లడించింది.
తప్పిన భారీ ప్రాణ నష్టం..
పడవలో మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించిన కెప్టెన్ వెంటనే సమీపంలోని నౌకలకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రెండు నౌకల సిబ్బంది అక్కడికి చేరుకుని పలువురిని కాపాడటంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. మరో రెండు నౌకలు తరువాత చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే, అప్పటికే పడవలో చాలా భాగం మంటల్లో కాలిపోయిందని, ప్రయాణికులు పడవ చివరి భాగంలో నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారని జకార్తా గ్లోబ్ (Jakarta Globe) పేర్కొంది. గల్లంతైన వారి వివరాలు ఇంకా తెలియరాలేదని.. వారి కోసం వెతుకుతున్నట్లు ఇండోనేషియా (Indonesia) సెర్చ్ అండ్ రెస్క్కూ కార్యాలయ అధికారులు వెల్లడించారు.
Also Read : కంటి చుక్కల్లోనూ కల్తీ..! ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ
Follow Us On : WhatsApp

