కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?.. కానిస్టేబుల్ ఫీజు తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తు ఫీజును రూ.1500గా నిర్ణయించడం నిరుద్యోగ యువతపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడమేనని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఫీజును గణనీయంగా తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఒక్క రూపాయి లేకుండా ఉద్యోగ దరఖాస్తుల అవకాశం కల్పిస్తామని, నామమాత్రపు ఫీజుతో అప్లికేషన్లు స్వీకరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి ఒక్క దరఖాస్తుకే రూ.1500 ఫీజు విధించడం దురదృష్టకరమని అన్నారు.

ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలపై ఆధారపడి జీవిస్తున్న యువతకు ఇంత భారీ ఫీజు చెల్లించడం భారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం, నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో దరఖాస్తు ఫీజులు వసూలు చేయడం సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తు ఫీజును తగ్గించి, నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా నామమాత్రపు ఫీజుతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, లేకపోతే ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని లక్ష్మణ్ హెచ్చరించారు.

Also Read : ‘కింగ్100’ కు దేవిశ్రీ ఫిక్స్.. హిట్ కాంబో బ్యాక్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>