కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ.. నిందితులు అరెస్ట్?

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పీఎంజే (PMJ Jewellery)  జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. దోపిడీ జరిగిన తర్వాత దొంగలు సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయారని, వారిని పట్టుకోవడం కష్టమని భావించిన చోట.. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత ఆధాంగా రివర్స్ ప్లాన్ వేశారు. సాధారణంగా దొంగలను పట్టుకున్నాక వారు సొత్తు ఎక్కడ అమ్మారో విచారిస్తారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్! దొంగల కంటే ముందే వారు సొత్తు అమ్మే అవకాశం ఉన్న ‘గోల్డ్ రిసీవర్స్’ (కొనుగోలుదారులు) డేటాను సేకరించి వారిపై నిఘా పెట్టారు.

ఈ ఒక్క క్లూ పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్‌కు బలాన్ని చేకూర్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు సుమారు 30 కిలోలకు పైగా బంగారాన్ని దోచుకున్న ఈ ముఠా.. కరీంనగర్ పోలీసుల తెలివితేటల ముందు తలవంచక తప్పలేదు. కమిషనరేట్ స్పెషల్ టీమ్ పంజా విసిరిందనే చెప్పవచ్చు. దోపిడీ సొత్తును నెట్‌వర్క్ ద్వారా వ్యాపారులకు చేరవేసే ముందే పక్కా ప్లాన్‌తో పోలీసులు దాడి చేశారు. ప్రస్తుతం ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కీలకమైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరో రెండు మూడు రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి కానుందని, ఎత్తుకెళ్లిన భారీ బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. గతంలో ఎన్నో దోపిడీలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఈ గ్యాంగ్.. కరీంనగర్ పోలీసుల దెబ్బకు ఈసారి అడ్డంగా బుక్కైపోయారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>