పక్కా ప్రణాళికతో వారి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు అన్ని వసతులు కల్పించాలన్నారు. రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం రాత్రి కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే 31 కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే మద్దతు ధర పొందగలరని సూచించారు. పౌర సరఫరాలు, డీఆర్‌డీఓ, సహకార, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, శుద్ధి యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులు కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐకెపి, సహకార సంఘాలు, హాకా, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇటీవలే సిద్దిపేట జిల్లాకు బదిలీపై వెళ్లిన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కే. మహేశ్వర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం రజనీకాంత్, సహకార అధికారి రామానుజాచార్యులు, డీఆర్‌డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్ పలు శాఖల అధికారులు అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>