సైలెంట్ మోడ్ లోకి నల్లగొండ బీఆర్ఎస్!

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండలో బీఆర్ఎస్ (Nalgonda BRS) సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నల్లగొండ నియోజకవర్గంలోనూ పెద్దఎత్తున కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పనులు చేపట్టింది. వీటిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో ప్రజాసమస్యలు సైతం విపరీతంగా నెలకొన్నాయి. అయితే అభివృద్ది పనుల విషయంలో కాంగ్రెస్ లీడర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ (Nalgonda)లో జరిగే ప్రతి అభివృద్ధిపైనా అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటిపై పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ (BRS) నిశబ్ధంగా వ్యవహరిస్తోంది. అధికార పక్షాన్ని ప్రతి పని విషయంలోనూ నిలదీయాల్సింది పోయి.. అసలు నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉందా..? లేదా..? అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. మరోవైపు పాలనపరమైన విధానాలపై బీఆర్ఎస్ యాక్టివ్ మూమెంట్ చూపడం లేదు. నియోజకవర్గ కేంద్రమే జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడికి పొలిటికల్ లీడర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సర్కార్ హాయంలో ఏ గల్లీలో చూసినా బీఆర్ఎస్ లీడర్ల హవా కనిపించేది. కానీ ప్రస్తుతం ఎక్కడా గులాబి నేతల ఊసే కన్పించడం లేదు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సైతం అంటీముట్టనట్లుగానే ఉంటుండడంతో క్యాడర్ సైతం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

సెకండ్ క్యాడర్ సప్పుడు లేదు..

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో పాటు చాలామంది బీఆర్ఎస్ లీడర్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెగ హడావిడి చేశారు. కానీ ప్రస్తుతం ఎవ్వరూ పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్‌లో లేనట్టు కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో బీఆర్ఎస్ కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతుందనే వాదన విన్పిస్తోంది. ఇలాంటి వాటిపై గ్రామసభల్లో గానీ జిల్లా యంత్రాంగం దృష్టికి గానీ తీసుకురావడంలో బీఆర్ఎస్ దారుణంగా విఫలమయ్యింది. ఉద్దేశపూర్వక కేసుల విషయంలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు నల్లగొండ నియోజకవర్గంలో కరువయ్యాడనే చెప్పాలి. గతంలో పదవులు అనుభవించిన లీడర్లే.. సమస్యలపై మౌనం వహిస్తుండడంతో సెకండ్ క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయింది. అసలు నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉందా..? లేక అజ్ఞాతంలోకి వెళ్లిందా..? అన్న చర్చ లేకపోలేదు. ఆఖరికి పదేండ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించిన మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సైతం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు.

అభివృద్ది పనులపై అవినీతి ఆరోపణలు..

నల్లగొండ పట్టణం చుట్టూ చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం విషయంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం చెరువు మట్టిని వినియోగిస్తున్నారంటూ జిల్లా యంత్రాంగానికి సైతం సామాన్యులు ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భూములకు పరిహారం ఇచ్చే విషయంలోనూ వివక్షత నెలకొందనే ప్రచారం ఉంది. దీనిపైనా ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి స్పందన లేదు. ఇతర అభివృద్ది పనులు.. ఔట్ సోర్సింగ్ నియామకాలు, మెడికల్ కాలేజీ, ప్రభుత్వాస్పత్రుల్లో పెద్దఎత్తున సమస్యలు ఎదురవుతున్నా.. ప్రజల పక్షాన నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకు రావడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంటే.. బీజేపీయే కాస్తో కూస్తో బెటర్ అని చెప్పాలి. నియోజకవర్గంలోని సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్‌లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. దీంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించి కష్ట కాలంలో ఎవ్వరూ కన్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>