కలం, వరంగల్ బ్యూరో: పేగు బంధాలు.. కట్టుకున్న బంధాలే ప్రాణాలను తీసేస్తున్నాయి. తోబుట్టువులు, తల్లిదండ్రులు.. ఇలా కుటుంబ సభ్యుల మధ్యే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తి వివాదాలు, దంపతుల కలహాలు, కట్న వేధింపులు, కుటుంబ సమస్యలు.. ఒక్కో ఘటనకు ఒక్కో కారణంగా కనిపిస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నెలల్లో చోటుచేసుకున్న కుటుంబ హత్యలు (Family Murders), విషాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కన్నతల్లి హత్య..
కాజీపేట డీజిల్ కాలనీలో గురువారం ఉదయశ్రీ(40) హత్యకు గురయ్యారు. ఆమెను కొడుకే హత్య చేశాడు. తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంట్లోంచి వెళ్లిపోయే ప్రయత్నంలో గుర్తించిన కొడుకు మందలించాడు. అందుకు తల్లి నిరాకరించడంతో చేసేదేం లేక కొడుకు కత్తితో పొడిచి చంపాడు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వేధింపులు తాళలేక..
మహబూబాబాద్ జిల్లాలో గత జనవరిలో కుటుంబ కలహాల్లో భర్తను భార్య హత్య చేసింది. భర్త వేధింపుల కారణంగానే ఘటన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు భార్యను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు జీవిత భాగస్వాములుగా ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరాయి.
కట్న వేధింపులకు..
మహబూబాబాద్ జిల్లాలోనే గత ఫిబ్రవరిలో భర్త, బావమరిది, అత్తమామలు కలిసి భార్యను గొంతు నులిమి చంపినట్లు కేసు నమోదైంది. కట్న వేధింపులే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు. కుటుంబ కలహాలు ఇద్దరు పిల్లల జీవితాలను ఆగం చేశాయి.
కడిపికొండలో డబుల్ మర్డర్
హనుమకొండ కడిపికొండ రాజీవ్ గృహకల్పలో గత మార్చిలో భార్య, మామ హత్యకు గురయ్యారు. ప్రవీణ్ తన భార్య(24), మామ(52)ను సుత్తితో కొట్టి హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి ఇంట్లోనే తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనను అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు ఘటనకు కారణమని తేల్చారు.
తల్లి, బిడ్డల మృతి
వర్ధన్నపేట మండలంలో గత మార్చిలో కళ్యాణి, రెండేళ్ల కొడుకు శ్రేయాన్ష్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలో పడి మృతి చెందారు. కుటుంబ కలహాలతోనే ఆమె నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త హరీష్ టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్. రెండేళ్ల చిన్నారి జీవితం కూడా కుటుంబ విషాదంలో ముగిసింది.
ఆడపిల్లలు పుడుతున్నారని..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు శివారులో గత ఏప్రిల్ లో జరిగిన ఘటన ఉమ్మడి జిల్లాలో విషాదం నింపింది. గర్భిణి ఫర్హాత్(26), ఆమె కుమార్తెలు ఉమేరా(8), ఆయేషా(6) స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందారు. భర్త అజారుద్దీన్ ఆడపిల్లల పట్ల వివక్ష, మరో పెళ్లి ఆలోచన తో భార్యతో పాటు ఇద్దరు బిడ్డలను స్విమ్మింగ్ పూల్లో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. కేసు దర్యాప్తులో పోలీసులు అజారుద్దీన్ మగ పిల్లలు పుట్టడం లేదని మరో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురిని హత్య చేసినట్లు నిర్ధారించారు.
ఆస్తి పంపకాల వివాదం కాస్త..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో గత జులైలో రత్నం అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. పొలం పంచాయితీ, భూ వివాదం నేపథ్యంలో కొడుకు రవీందర్ తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబంలో ఆస్తి పంపకాలపై మొదలైన వివాదం చివరకు తండ్రి ప్రాణం తీసింది.
అన్నదమ్ముల మధ్య ఫోన్ గొడవ
గీసుకొండ మండలం గరీబ్‌నగర్‌లో ఈనెల 19న అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ విషాదాంతమైంది. పాత ఫోన్ ఇవ్వకపోవడంపై తలెత్తిన వివాదంలో అన్న ప్రవీణ్(32) తమ్ముడు ప్రసాద్(31)ను కత్తితో పొడిచి హత్య చేశాడు. చిన్న విషయంగా మొదలైన గొడవ ప్రాణాలు తీసేవరకు వెళ్లింది.
పరిష్కారమే మార్గమని..
ఆయనా ఘటనల్లో కారణాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, కుటుంబాల్లో విషాదమే మిగిలింది. పిల్లలు తల్లిని కోల్పోయారు. మరో చోట తండ్రిని కోల్పోయారు. ఇంకొక కుటుంబంలో అన్నదమ్ముల బంధం శాశ్వతంగా తెగిపోయింది. కుటుంబంలో విభేదాలు రావడం సహజం. కానీ అవి హింసకు దారితీయకముందే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఆవేశంలో తీసుకున్న ఒక్క నిర్ణయం తిరిగి మార్చలేని పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.

