కొనసాగుతున్న శోభాయాత్ర: ప్రజలకు సీపీ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్ : గణేశ్ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Immersion) నేపథ్యంలో హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండటంతో నగర రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. పలు మార్గాల్లో సిటీ బస్సుల రాకపోకలను నిలిపివేయడం, దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

విజయవాడ నుంచి నగరంలోకి వచ్చే ప్రైవేట్ బస్సులను పోలీసులు ఎల్బీనగర్ వద్దే నిలిపివేస్తున్నారు. బస్సులను నగరంలోకి అనుమతించకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎల్బీనగర్ లోనే దిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.

మరోవైపు ట్యాంక్ బండ్ – రాణి గంజ్ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. నిమజ్జనానికి తీసుకొస్తున్న ఓ 20 ఫీట్ల భారీ విగ్రహం ఎత్తు కారణంగా ట్యాంక్ బండ్ కమాన్ దగ్గర ఆగిపోయింది. విగ్రహం కమాన్ గుండా ముందుకు వెళ్లేందుకు వీలుగా దాని కిరీటాన్ని తొలగించే ఏర్పాట్లను పోలీసులు, కమిటీ నిర్వాహకులు చేపట్టారు.

నగర సీపీ కీలక విజ్ఞప్తి..

ట్రాఫిక్ పరిస్థితిపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) స్పందిస్తూ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి శోభాయాత్ర ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోందని తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందని వివరించారు. ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని, విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పోలీసు, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రధాన మార్గాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని, ట్రాఫిక్ విభాగం ఇచ్చే అధికారిక సూచనలను గమనిస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>