కలం, కరీంనగర్ బ్యూరో: వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులపై కరీంనగర్ మేయర్ (Karimnagar Mayor) కొలగాని శ్రీనివాస్ కీలక సూచనలు చేశారు. నగర ప్రజలకు వేసవిలో నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరాపై హైలెవల్ నీటి సరఫరా డివిజన్ల కార్పొరేటర్లు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో మేయర్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ పలు సూచనలు చేశారు.
లీకేజీల నివారణపై సుదీర్ఘ చర్చ
హైలెవల్ నీటి సరఫరాలో తరుచుగా తలెత్తున్న తాగునీటి సమస్యలు, ప్రజల ఇబ్బందులు, వాటి పరిష్కారం, నీటి సరఫరా సమయపాలన, లీకేజీల నివారణ, తదితర అంశాలపై మేయర్ సుదీర్ఘంగా చర్చించారు. నగరంలోని సమస్యలను పలువురు కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చారు. నీటి సరఫరాను మెరుగు పరిచి… భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లు సూచనలు ఇచ్చారు.
సమస్యలను పరిష్కరించండి
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి సరఫరా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. ప్రతి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. నీటి సరఫరా సమయంలో ఈఈ, డీఈ, ఏఈ, లైన్ మెన్, ఫిట్టర్ క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే పరిష్కరించండి
ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చిన స్వయంగా పరిశీలించి దాన్ని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు, ప్రజలు అధికారులు, సిబ్బంది దృష్టికి తెచ్చిన సమస్యను నోట్ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. మంచి నీటి సరఫరా విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లైన్‌మెట్లు, పిట్టర్లు ముఖ్యంగా జవాబుదారీతనంగా పని చేయాలన్నారు. ప్రజల పట్ల దురుసుగా మాట్లాడినట్లు తమ దృష్ఠికి వస్తే… చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మానేరు డ్యాంలో నీటి సామర్థ్యం నిలకడగా ఉండేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశామని మేయర్ గుర్తు చేశారు. ప్రస్తుతం 7 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందన్నారు. నగరపాలక సంస్థ పరిదిలో లోలెవల్, హైలెవల్ ప్రాంతాల్లో గంటవరకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ప్రవీణ్ రావు, అంజన్ కుమార్, గంట శ్రీనివాస్, బండ రమణారెడ్డి, ఓంటెల సత్యనారాయణ రెడ్డి, వరాల నర్సింగం, గుగ్గిళ్ల జయశ్రీ, రమన్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిల్ల రాజకుమారి ప్రసాద్, గాజరమ శివరాం, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, పెద్దపల్లి శ్రీలేక జితేందర్, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు, ఏఏఈలు, లైన్‌మన్ ఫిట్టర్లు పాల్గొన్నారు.

