కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) నిజంగానే ఉద్యోగులకు వరప్రదాయినిగా నిలుస్తోందని ఎన్జీవోల సంఘం, కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ (Employees JAC) నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఈహెచ్ఎస్ ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ టౌన్‌లోని సన్‌రైజ్, అపోలో రీచ్, మెడికవర్, స్టార్ తదితర ప్రముఖ ఆసుపత్రులను జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మాడిపెల్లి కాళీచరణ్ గౌడ్ , పర్యవేక్షకులు మారం జగదీశ్వర్ నాయకత్వంలో జేఏసీ బృందం సందర్శించింది.
క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చ..
ఈ సందర్భంగా హెల్త్ స్కీమ్ అమలు తీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న క్షేత్రస్థాయి సవాళ్లపై ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, చికిత్స పొందుతున్న ఉద్యోగులతో విస్తృతంగా చర్చించారు. హెల్త్ స్కీమ్ నిబంధనల ప్రకారం రోగుల నుంచి రూపాయి కూడా అదనంగా తీసుకోకుండా నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
సన్‌రైజ్ హాస్పిటల్లో జరిగిన ‘Meet – Greet’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, ఆసుపత్రిని కూడా హెల్త్ స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను పరామర్శించిన నాయకులు, ముఖ్యంగా మోకాళ్ల మార్పిడి హృదయ సంబంధిత సంక్లిష్ట శస్త్రచికిత్సలకు హెల్త్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతోందని పేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
దుష్ప్రచారాలను నమ్మవద్దు..
సోషల్ మీడియాలో EHS పథకంపై, ఎంప్లాయీస్ జేఏసీపై వస్తున్న అసత్య ప్రచారాలను మారం జగదీశ్వర్ తీవ్రంగా ఖండించారు. నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, స్వయంగా ఆసుపత్రులను సందర్శించి సేవలను పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు. EHSకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే నేరుగా జేఏసీ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రిమండలికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వైద్యులు దేవుళ్లతో సమానం..
వైద్యుల సేవలను “వైద్యో నారాయణో హరి” అనే సూక్తిని గుర్తు చేస్తూ దారం శ్రీనివాస్ రెడ్డి, మాడిపెల్లి కాళీచరణ్ గౌడ్ మాట్లాడారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆపదలో ప్రాణాలు కాపాడి వైద్యులు పునర్జన్మను అందిస్తారని ప్రశంసించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా కాకుండా, సేవా భావంతో, మానవతా దృక్పథంతో ఉద్యోగులకు వైద్యం అందించాలని ఆసుపత్రుల యాజమాన్యాలను కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, DMHO రాజ్ గోపాల్ రావు, EHS జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజు, మేనేజర్ విజయ్, వైద్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ చాందిని, డాక్టర్ వెంకటరెడ్డి, ఆసుపత్రుల ప్రతినిధులు సతీష్, కిరణ్, జేఏసీ/టీఎన్జీవో నాయకులు నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, ఆకుల సతీష్, మారుపాక రాజేష్ భరద్వాజ్, రమేష్ గౌడ్, వెలిచాల సుమంత్ రావు, అస్గర్ అలీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

