భారత రాష్ట్ర సమితి కాదు.. ‘ఫామ్‌హౌస్ రెస్ట్ సమితి’: అంజన్ కుమార్

​కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విడుదల చేసిన ఛార్జ్‌షీట్ కేవలం అబద్ధాల పుట్ట అని, అది కేసీఆర్ అబద్ధాల షీట్, కేటీఆర్ అక్కసు ఫీట్ తప్ప మరొకటి కాదని కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ అంజన్ కుమార్ (Anjan Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యాలయమైన ‘ఇందిరా భవన్’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​

కాంగ్రెస్ పాలనను ఓర్వలేకే కల్వకుంట్ల కుటుంబ ఆక్రోశం:

తెలంగాణలో నిరంకుశ గడీల పాలన కూలిపోయి, ప్రజాస్వామ్య ప్రజా పాలన పునరుద్ధరణ జరిగి 1000 రోజులు పూర్తయిన సందర్భంగానే కల్వకుంట్ల కుటుంబం ఓర్వలేక ఈ తరహా ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం చూసి గులాబీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

​ఎవరిపై మీ ఈ ఛార్జ్‌షీట్..?

ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ​రుణమాఫీ, రైతు భరోసా అందుకొని సుభిక్షంగా ఉన్న తెలంగాణ రైతన్నలపై మీ ఛార్జ్‌షీటా?, ​ప్రభుత్వం ఇచ్చిన 70 వేల ఉద్యోగాలు అందుకని సంతోషంగా ఉన్న యువతపై మీ ఛార్జ్‌షీటా?, ​15 లక్షల కొత్త రేషన్ కార్డులు అందుకొని సన్న బియ్యం తింటున్న మూడున్నర కోట్ల పేదలపై మీ ఛార్జ్‌షీటా?, ​200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో కాంతులు నింపుకున్న 52 లక్షల కుటుంబాలపై మీ ఛార్జ్‌షీటా?, ​ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, 1000 బస్సులకు యజమానులైన సోదరీమణులపై మీ ఛార్జ్‌షీటా?, ​4.8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి చారిత్రాత్మక నిర్ణయాలపై మీ ఛార్జ్‌షీటా? అని అంజన్ కుమార్ ప్రశ్నించారు.

భారత రాష్ట్ర సమితి కాదు.. ‘ఫామ్‌హౌస్ రెస్ట్ సమితి’

పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని మింగేసిన అవినీతి అనకొండలు కేసీఆర్, కేటీఆర్ అని అంజన్ కుమార్ మండిపడ్డారు. సొంత చెల్లి అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని చవటలు, ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురునిలిచి మాట్లాడే ధైర్యం లేక ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమయ్యే బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ పేరును ‘ఫామ్‌హౌస్ రెస్ట్ సమితి’గా మార్చుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు.

ఈ సమావేశంలో RGPRS జిల్లా చైర్మన్ మడుపు మోహన్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్, కంకణాల అనిల్, పహాడ్ ఇమ్రాన్ ఘని, శ్రీనివాస్, ఖదీర్, ప్రశాంత్ గౌడ్, పాండుర్ల విజయ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>