కలం, మక్తల్: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కాగితాలు, శిలా ఫలకాలకే పరిమితం అయ్యిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలను ఇచ్చిందని తెలిపారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత హామీలను విస్మరించిందని విమర్శించారు. నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) నియోజకవర్గంలోని మాగనూరు మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనపై సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్ద వాగు బ్రిడ్జి వద్ద నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిట్టెం (Chittem Rammohan) మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అధికారం చేపట్టి ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నప్పటికీ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించడం లేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం కాగితాలు శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. అటు సంక్షేమ పథకాలను సైతం నిలిపివేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని ఆయన అన్నారు. ప్రజలకు గత మూడేళ్లుగా బాకీ పడ్డ ప్రతి పైసాకు ప్రభుత్వం తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చిట్టెం వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నరసింహ గౌడ్, నాయకులు శివరాజ్ పాటిల్, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, రఘు, శివప్ప, జుట్ల చిన్న హనుమంతు, ముడుమాల్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : రేవంత్ బ్లాక్ మెయిల్ చేయడంతో.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

