100 శాతం రుణమాఫీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: పువ్వాడ!

​కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలోని ఏ గ్రామంలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని, ఈ విషయాన్ని నిరూపించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు ఉందా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు (Thummala Nageswara Rao) బహిరంగ సవాల్ విసిరారు.

గురువారం ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సు సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని మండిపడ్డారు.

​అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా వచ్చాక బడ్జెట్ కోతలు పెడుతూ కేవలం అరకొరగా మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా మెజారిటీ రైతులకు రుణమాఫీ కాలేదని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేకుండా చూస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం యాప్‌లలో బుకింగ్స్ చేసుకోవడం, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడడం, చెప్పులు వరుసలో పెట్టే పాత రోజులను మళ్లీ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

​అంతేకాకుండా, 24 గంటల ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ సరిగ్గా సరఫరా చేయలేకపోతోందని, నిరంతరం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఏటా ఎకరానికి రూ. 10,000 చొప్పున క్రమం తప్పకుండా అందించిన ‘రైతు బంధు’ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, ఏటా రూ. 15,000 ఇస్తామన్న హామీని పక్కన బెట్టి కౌలు రైతులకు, కూలీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హామీల అమలులో దగా చేసిన ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా మారుతుందని పువ్వాడ (Puvvada Ajay) స్పష్టం చేశారు.

Also Read : రేవంత్‌ బ్లాక్ మెయిల్ చేయడంతో.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>