కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) డాటర్ స్ట్రోక్ తగిలింది. కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. స్వయంగా ఆమె వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఏఐసీసీ ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపారు. దీంతోపాటు తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేసినట్లు వెల్లడించారు. డాక్టర్ జి. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ నూతన వైస్ ఛైర్మన్‌గా నియమించారు. నేరెళ్ల శారదను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. జి. సుధారాణి, మాజీ రాజ్యసభ ఎంపీని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా నియమించేందుకు ఆమోదం తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని టార్గెట్ చేస్తూ గత నెల 19న కొండా సుష్మిత చేసిన పరుష వ్యాఖ్యలపై చర్యలు తీసుకోడానికి దాదాపు రెండు వారాలకు పైగా సమయం తీసుకున్న పార్టీ హైకమాండ్ చివరకు ఆమె(Konda Surekha)ను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఢిల్లీలో బుధవారం జరిగిన సీరియస్ చర్చల అనంతరం ఆమెకు ఉద్వాసన పలకడం అనివార్యమైంది. కూతురు వ్యాఖ్యలతోనే ఆమె పదవికి ముప్పు ఏర్పడినా ఓదార్చేందుకు ఆ కూతురే అందుబాటులో లేరు. ఈ నిర్ణయం జరిగే సమయానికి ఆమె లండన్‌లో ఉన్నట్లు సమాచారం.
కొండా సురేఖ సైతం అదే వ్యాఖ్యలు
కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలకు తనకెందుకు షోకాజ్ నోటీసు జారీచేస్తారంటూ తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా కమిటీని ప్రశ్నించిన కొండా సురేఖ.. ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలని తన వివరణలోనే డిమాండ్ చేశారు. ఆ తర్వాత రెండో లేఖలో.. తనపైన చర్యలు తీసుకోవాలంటూ బహిరంగంగా మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా వారు మాట్లాడారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో వరుస భేటీలు జరుగుతున్న సమయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా.. “నాపైన పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా ముఖ్యమంత్రిపైనే తీసుకోవాల్సి ఉంటుంది.. మంత్రి పొంగులేటిపైనా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపైనా పలు ఆరోపణలు వచ్చాయి. వారిపైనా చర్యలు తీసుకోవాలి. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ వ్యాఖ్యానించడానికి రేవంత్‌రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు?.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరును ఖరారు చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు?..” అంటూ వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ చీఫ్ సమావేశంలోనే స్పష్టత
సుష్మిత (Konda Susmita) వ్యవహారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమైన సందర్భంగానే ఇకపైన మంత్రిగా కొనసాగడం కష్టమేననే అభిప్రాయానికి వచ్చినట్లు ఆమె మాటల ద్వారానే వ్యక్తమైంది. చూద్దాంలే.. అంటూ ఖర్గే ఇచ్చిన వివరణతోనే ఎలాంటి నిర్ణయం వెలువడబోతున్నదో గ్రహించి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ముఖ్యమంత్రిపైనే బాణాన్ని ఎక్కుపెట్టారు. కొద్దిమంది మంత్రులు ఆమెకు సానుకూలంగా ఉన్నప్పటికీ కుమార్తె విషయంలో ఆమె “నా కూతురికి స్వతంత్రత ఉన్నది.. ఆమెకు పెళ్లయింది.. ఓ ఇంటికి కోడలిగా ఉన్నది.. ఆమె వ్యాఖ్యలను ప్రశ్నించే అధికారం నాకు లేదు. ఆమె జీవితం.. ఇమె ఇష్టం.. ఆమె వ్యాఖ్యలను సమర్ధించను.. ఖండించను.. ఆమె వ్యాఖ్యలతో నాకు, నా భర్త రాజకీయానికి ముడిపెట్టడం తగదు..” అంటూ కుమార్తెను వెనకేసుకురావడం గమనార్హం. జరగబోయే చర్యలను ముందుగానే పసిగట్టి బీసీ ఎజెండాతో తదుపరి కార్యాచరణకు ఆమె సిద్ధమవుతున్నారు.
Also Read : కొండా సురేఖకు కేఏ పాల్ బంపర్ ఆఫర్!
Follow Us On: X(Twitter)


