కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా కొనసాగిందని.. నేడు దండుగలా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై గురువారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) మండలం కోడూరు చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు తమ పంట పొలాలు సిద్ధం చేసుకోవాలంటే సాగునీరు లేదని, ఎరువులు కొందామంటే లైన్‌లో నిడబడాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు. సాగునీరు లేక బోర్లపై ఆధారపడ్డ రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలు అందడం లేదన్నారు. కౌలు రైతుల పరిస్థితి కూడా మరింత దిగజారిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కరివేన ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తిచేస్తే పాలమూరు హనుమాడ మండలాలు సస్యశ్యామలమయ్యేవని ఆయన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూముల రేట్లు పెరిగాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేవని, ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి మోసపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయాన్ని నమ్ముకునే పరిస్థితులు లేవని గ్రహించిన చాలామంది రైతులు వలస బాట పట్టారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతు కమిటీ మాజీ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లు దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుధా శ్రీ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, రాజ గోపాల్, చెన్నయ్య యాదవ్, అల్లాఉద్దీన్, రాఘవేందర్ గౌడ్, శ్రీనివాసులు, నర్సింహులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

