కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు వెంటనే ప్రొసీడింగ్స్ అందించాలని, కొత్తగా మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, వివో బిల్డింగుల నిర్మాణం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అమలు, కిశోర బాలికల సంఘాల ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల స్థాపన తదితర అంశాలపై ఎంపీడీవోలు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివో బిల్డింగుల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. మహిళా సంఘాల పెట్రోల్ బంకుల స్థాపనకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం గురించి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన కుటుంబాలు పథకం ప్రయోజనాలు పొందేలా చూడాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌ఛార్జి జడ్పీ సీఈవో పవన్ కుమార్, డీఆర్‌డీఓ గీత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

