కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించిన దరఖాస్తుదారులకు 100 శాతం ప్రొసీడింగ్స్‌ను సత్వరమే అందించాలని కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ మోడ్‌లో వేగవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్‌ఆర్‌ఎస్ అమలు ప్రక్రియ పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వివరాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. పెండింగ్ కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
వర్షాకాలం సన్నద్ధతపై సమీక్ష..
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. పారిశుద్ధ్య వాహనాలు, ఫాగింగ్ యంత్రాలు, ఆయిల్ బాల్స్ తదితర అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ బృందాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో పాటు స్వామి, బషీర్, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

