కలం, స్పోర్ట్స్: శ్రీలంకలో జరుగుతున్న త్రైదేశీయ సిరీస్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఘటన చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత సీనియర్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే (Sairaj Bahutule) అతనికి మద్దతుగా నిలిచారు. శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్ అనంతరం విషెన్ హలంబాగేతో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, అసలు పరిస్థితి ఎలా ఏర్పడిందో పూర్తిగా తెలియదని అన్నారు.
తనకు తెలిసిన వైభవ్ చాలా ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడని బహుతులే (Sairaj Bahutule) తెలిపారు. భారత్ ఏ జట్టుతో ఉన్న కోచ్‌లు అతనికి సరైన సూచనలు చేసి ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించాలో ఇరు జట్లకూ అవగాహన అవసరమని పేర్కొన్నారు.
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆటగాడిగా వైభవ్‌పై ఎక్కువ బాధ్యత ఉందని బహుతులే గుర్తు చేశారు. ఈ ఘటన నుంచి అతను పాఠాలు నేర్చుకుంటాడని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీస్తుండగా, యువ ఆటగాళ్లకు సరైన మార్గనిర్దేశం అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

