కలం, కరీంనగర్ బ్యూరో: సాంకేతికత, ముందస్తు ప్రణాళికలతో వానాకాలం సాగుకు సిద్ధం కావాలని కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖలపై సమీక్ష చేశారు. వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించి, నికర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. తృణధాన్యాలు, నూనెగింజలు, పత్తి సాగు పెరిగేలా చూడాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వస్తున్నందున ఆ పంటతో తయారయ్యే ఉత్పత్తి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.
ఎరువుల బుకింగ్‌పై అవగాహన కల్పించాలి..
నాణ్యత గల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖ పథకాలను వివరించే వాల్ పోస్టర్లు ముద్రించి.. రైతు వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పండ్ల తోటలు, పూల తోటలు, ఆయిల్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతుల విజయాలను గ్రామాల్లో వివరించడం వలన ఆ పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. చేప పిల్లల విత్తనాల విడుదల సకాలంలో జరిగేలా సన్నద్ధం కావాలని తెలిపారు. పశువుల ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి విజయభారతి, పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి, ఆత్మ పీడీ ఛత్రు నాయక్, మార్క్‌ఫెడ్ డీఎం గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

