‘చేయూత’ పరిశీలన.. కరీంనగర్ కలెక్టర్‌కు సీఎస్ అభినందనలు

​కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు గణనీయంగా మెరుగుపడాలని.. విద్యా శాఖ, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, పింఛన్ల వెరిఫికేషన్ వంటి కీలక అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎం శ్రీ, సమగ్ర శిక్ష అభియాన్ నిధుల వినియోగం, VBG RAM G ఉపాధి కల్పన, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి నివారణ చర్యలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.

​ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ (Karimnagar) పాత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.  ​ఈ సందర్భంగా ‘చేయూత’ పథకం కింద కొత్తగా వచ్చిన పెన్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా, అత్యంత పారదర్శకంగా పరిశీలించి అర్హులను గుర్తించిన తీరుపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra)ను సీఎస్ సంజయ్ జాజు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకుండా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా వెరిఫై చేయించినట్లు వివరించారు.

​సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. పీఎం శ్రీ, సమగ్ర శిక్ష అభియాన్ నిధులను వచ్చే జనవరి మొదటి వారంలోగా 100 శాతం వినియోగించాలని, తద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫారాలు, కిట్లు అందేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, నవంబర్ 15 నాటికి చేతిపంపులు, బోర్ల మరమ్మతులు పూర్తి చేయడంతో పాటు ప్రతి జిల్లాలో తాగునీటి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

​మార్చి నెలాఖరు నాటికి VBG RAM G ద్వారా 12 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యంగా పనిచేయాలని సీఎస్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, రూ.230లకే సబ్సిడీ సిమెంట్ బస్తాలు సక్రమంగా అందేలా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత, ప్రగతి ఆధారంగానే అధికారుల పనితీరు మూల్యాంకనం ఉంటుందని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>