కలం, కరీంనగర్: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత డ్రగ్స్ వ్యసనానికి దూరంగా ఉండాలని కరీంనగర్ జిల్లా అఖిల భారత యువజన సమైక్య (Karimnagar AIYF) వర్కింగ్ ప్రెసిడెంట్, నగర ఇన్‌ఛార్జి కశిబోజుల సంతోష్ చారి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏఐవైఎఫ్ మూడో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నగర కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంతోష్ చారి మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సాంకేతిక, నైపుణ్య ఆధారిత విద్యను అందించి యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గిగ్ విధానాలతో యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో వ్యవహరించడం శోచనీయమని సంతోష్ చారి అన్నారు. వెంటనే ప్రత్యేక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్నారు. చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. యువత కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ’రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి సందీప్, నాయకులు శ్రావణ్, బి. సతీష్ పాల్గొన్నారు.

