కలం, కరీంనగర్: జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం సెకండ్ గేట్ నుండి ఎల్ఐసీ ఆఫీస్ వరకు ఫుట్ పాత్ రోడ్ ఆక్రమించి విచ్చలవిడిగా వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య – ఏఐవైఎఫ్ (Karimnagar AIYF) జిల్లా కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ స్టేడియం మార్గంలో రోడ్డునక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారస్తులు హోటల్లు, సోడా బండ్లు, తినుబండారాలు, పండ్ల వాహనాలు తదితరులు రోడ్లను, ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పారు. దానికి తోడు ఇదే ప్రాంతంలో రెండు వైన్సులు, రెండు బార్లు ఎలాంటి పార్కింగ్ ప్లేసులు లేకుండా నడుపుతున్నారని అన్నారు. నిత్యం ఇక్కడికి వచ్చి మద్యం తాగే మందుబాబులు గంటల తరబడి కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి..
నిత్యం వేలాదిమంది అంబేద్కర్ స్టేడియానికి వస్తూ వెళ్తూ ఉంటారని.. అదే సందర్భంలో నగరంలోని చాలామంది వృద్ధులు మహిళలు పిల్లలు వాకింగ్, క్రీడల కోసం వస్తూ వెళ్తూ ఉంటారని, కాబట్టి అనేకమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. రోడ్లపైనే వ్యాపారాలు, పార్కింగ్ చేయడం వల్ల స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, నిత్య అవసరాల నిమిత్తం వచ్చి వెళ్లే ప్రజలకు తీవ్రమైన సమస్యలు ఎదురై ఆ రోడ్డుకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఎదురవుతోందని అన్నారు.
కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నతాధికారులు రోడ్లపై ఇరువైపులా పార్కింగ్, వ్యాపారం చేసుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని యుగంధర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోజుల సంతోష్ చారి, జిల్లా సహాయ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు చంచల మురళి, కోశాధికారి పెనమల్ల ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
Follow Us On: Instagram

