కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార జాతాలు నిర్వహించనున్నట్లు CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ (M Bala Narasimha) తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామరెడ్డి భవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం. బాల నరసింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేశాయని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం పారదర్శక పాలన అందించడంలో విఫలమైందని విమర్శించారు.
అయోధ్య రామమందిరం భక్తుల కానుకల చోరీ, బద్రీనాథ్ ఆలయంలో బంగారు తాపడాల చోరీ ఘటనలను ప్రస్తావిస్తూ, బీజేపీ పాలనలో హిందూ దేవాలయాల భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. దేశంలో శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయవ్యవస్థ స్పందించిన తీరుపైనా స్పందించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి. పరమేశ్వర్ గౌడ్, పి. సురేష్, డి. రాము, గోవర్ధన్, కె. పద్మావతి, జిల్లా సమితి సభ్యులు సత్యనారాయణ రెడ్డి, చాంద్ బాషా, మహేష్, ఖలీం, లక్ష్మణ్, రాజశేఖర్, దచక్‌పల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్. శంకర్ నాయక్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్ కుటుంబంపై కవిత సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

