Mobile Popup Ad
Mobile Popup Ad

రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి: కంచర్ల జమలయ్య

కలం, ఖమ్మం బ్యూరో: వాహనదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతూ, ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్న రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య (Kancherla Jamalaiah) డిమాండ్ చేశారు. ఈ కొత్త విధానం వల్ల ఆటో డ్రైవర్లతో పాటు రవాణా రంగంలోని వివిధ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టం కలుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కొత్తగూడెం పరిధిలోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మికులతో కలిసి ఆర్టీఏ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా కంచర్ల జమలయ్య మాట్లాడుతూ.. మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేకపోయినప్పటికీ రవాణా శాఖ అధికారులు వీటికి కొత్తగా క్యూఆర్ కోడ్ నిబంధనను చేర్చి ప్రైవేట్ కంపెనీల దోపిడీకి ఊతమిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వాహనదారుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవ్వడంతో వెనక్కి తగ్గిన రవాణా శాఖ, ఇప్పుడు మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా ఈ దోపిడీ విధానాన్ని అమలులోకి తెచ్చిందని విమర్శించారు. సాధారణ రిఫ్లెక్టివ్ టేపుల కంటే రెట్టింపు ధరలతో వీటిని విక్రయిస్తూ, వాహనం చుట్టూ 22 మీటర్ల నుంచి 26 మీటర్ల వరకు టేపులను అతికించాలనే కొత్త నిబంధనను తీసుకురావడం దుర్మార్గమన్నారు. దీనివల్ల ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, లారీలు, బస్సుల యజమానులపై వేలాది రూపాయల అదనపు భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​కేవలం ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి అనుచిత లాభం చేకూర్చడం కోసమే అధికారులు ఈ దోపిడీకి రంగాన్ని సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్న ఈ నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణతో పాటు యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, వాహనదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>