నల్లగొండలో అరాచక పాలన: మాజీ ఎమ్మెల్యే విమర్శ!

కలం, నల్లగొండ: నల్లగొండలో ప్రజాపాలన పేరుతో అరాచక రాజ్యం నడుస్తోందని, మంత్రి కోమటిరెడ్డి అండదండలతోనే కమిషన్ల దందా పెచ్చురిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 546 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని భూపాల్ రెడ్డి ఆరోపించారు.

గతంలో ప్రజల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించిన లక్కీ డ్రా జాబితాను పక్కనబెట్టి, ఒక్కో ఇంటికి రూ.3 లక్షల వరకు లంచాలు వసూలు చేస్తూ అర్హత లేని వారికి కేటాయించారని మండిపడ్డారు. తక్షణమే ఈ కేటాయింపులపై పునఃపరిశీలన చేపట్టి, తిరిగి లక్కీ డ్రా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో 15 రోజుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తాళాలు వేసే కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘సొంత ఇల్లు లేదని పదేపదే చెప్పుకునే మంత్రికి కలెక్టర్ ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించాలి’ అంటూ సెటైర్లు వేశారు.

కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వెంచర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి వాడుకుంటున్నారని, దీనిపై త్వరలోనే విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే పట్టణ అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని విమర్శించారు. సీపీఎం కార్యాలయంపై పోలీసులు జరిపిన దాడిని భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) తీవ్రంగా ఖండించారు.

బాధ్యులైన అధికారులపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఎలాంటి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Also Read : పరకాల నియోజకవర్గానికి సీఎం అభివృద్ధి వరాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>