కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) లోని బీడ్ (Beed) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మాజల్‌గావ్ బైపాస్ రోడ్డులో ఇద్దరు కార్మికులు డీపీ (విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్) ఏర్పాటు చేస్తుండగా ఘోర ఘటన జరిగింది. పనులు జరుగుతున్న లైన్ షట్ డౌన్ తీసుకున్నారనే నమ్మకంతో స్తంభం ఎక్కిన కార్మికుడు, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా పునరుద్ధరింపబడటంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
కరెంట్ షాక్ తగిలిన కేవలం 5 సెకన్లలోనే సదరు కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అదృష్టవశాత్తు మరో కార్మికుడు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకున్నాడు. మృతిచెందిన కార్మికుడిని అవేజ్ పాషా దేశ్ ముఖ్(32)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే మాజల్‌గావ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్, లైన్ మెన్, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

