కలం, వెబ్ డెస్క్ : రైతు డిస్కం ఏర్పాటు వెనుక మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. బంజారాహిల్స్ లోని పార్టీ (TRS) కార్యాలయంలో శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు రహస్యంగా ఉంచి నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎత్తివేయం, మోటార్లకు మీటర్లు పెట్టం అని చిట్ చాట్ లో చెప్పిన మాటలను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభల్లో ఇచ్చిన మాటలనే తప్పిన ముఖ్యమంత్రి, రేపు మాట మార్చరనే గ్యారెంటీ లేదన్నారు. ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సంస్కరణల జీవోలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని విమర్శించారు.
రైతు డిస్కం ఏర్పాటు విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని, వినియోగదారులైన రైతుల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టాలని, ఒకవేళ ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లైనా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటికే కేసు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. రైతు భరోసా రెండు ఎకరాల లోపు వారికే పరిమితం చేశారని, ముప్పై శాతం మందికి రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ధాన్యం కొనుగోలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు. రైతు బీమాను యాక్సిడెంటల్ బీమాగా మార్చే కుట్ర చేస్తున్నారని, ఈ ప్రభుత్వ చర్యలన్నీ రైతు వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
హైడ్రా తీరుపై కోర్టులు ప్రభుత్వానికి అక్షింతలు వేస్తున్నా అనుకూల మీడియా దాన్ని సమర్థిస్తోందని కవిత (Kavitha) ఆరోపించారు. బడా వ్యక్తులు చేసిన కబ్జాలపై తాను ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టిందని, పెద్ద వాళ్లను కాపాడుతూ పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసిగుడ్డు చేయి తీసేయాల్సి రావడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి, ఖమ్మం మంత్రులు స్పందించి ఆ చిన్నారి పేరు మీద ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న కుమ్మెర గ్రామంలో కులవివక్షతో పసిగుడ్డును చంపిన ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ లో భాగంగా దసరా లోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేపడతామని కవిత హెచ్చరించారు.
Read Also: ఇరాన్‌తో అణు ఒప్పందం.. లేదంటే యుద్ధమే : ట్రంప్
Follow Us On: Sharechat

